ఇంఫాల్: మణిపూర్‌లో అనుమానిత తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. (Firing In Manipur) ఈ సంఘటనలో ఒక మహిళ మరణించింది. 12 ఏళ్ల ఆమె కుమార్తెతోపాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. కుకీ తీవ్రవాదులు ఆ మహిళను కాల్చి చంపినట్లు మైతీలు ఆరోపించారు. అలాగే ఒక ఇంటిపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగినట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కుకీల ఆధిపత్యం ఉన్న కాంగ్పోక్పిలోని నఖుజాంగ్ గ్రామం నుంచి మైతీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ వెస్ట్‌లోని కదంగ్‌బండ్ వైపు కాల్పులు జరిగాయి. దీంతో కదంగ్‌బండ్ నుంచి కూడా కాల్పులు ప్రారంభమయ్యాయి.
కాగా, కాల్పుల్లో గాయపడిన కదంగ్బండ్కు చెందిన 31 ఏళ్ల నగాంగ్‌బామ్ సుర్బాలా అనే మహిళను ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కుకీ ఉగ్రవాదులు ఆ మహిళను హతమార్చారని మైతీలు ఆరోపించారు. అయితే కాంగ్పోక్పిలోని కుకీ గ్రామాలపై మైతీలు తొలుత కాల్పులు జరిపినట్లు కుకీ తెగకు చెందిన వారు సోషల్ మీడియాలో కౌంటర్ ఆరోపణలు చేశారు.
మరోవైపు ఇరువైపులా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు చెప్పారు. అయితే గాయపడిన పోలీసులకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. కాగా మణిపూర్‌లోని మెజారిటీ వర్గమైన మైతీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మైనారిటీ వర్గమైన కుకీలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 2023 మే నుంచి ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు, పోరాటాలు జరుగుతున్నాయి. దాడులు, ప్రతి దాడుల్లో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రులయ్యారు.