Kuldeep Bishnoi | కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డాలతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు కుల్దీప్ బిష్ణోయ్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మాజీ ముఖ్యమంత్రి కీ.శే. భజన్‌లాల్ చిన్న కొడుకే కుల్దీప్ బిష్ణోయ్. హర్యానా పీసీసీ అధ్యక్ష పదవికి తన పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తున్నప్పటి నుంచి బిష్ణోయ్ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో అమిత్‌షా, నడ్డాలను కలుసుకున్న బిష్ణోయ్ వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ మేరకు వారితో కలిసిన ఫొటోలను ట్విట్టర్లో బిష్ణోయ్ స్వయంగా పోస్ట్ చేశారు. అమిత్‌షా, నడ్డాలతో భేటీతో కుల్దీప్ బిష్ణోయ్ తదుపరి ఎత్తుగడపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకోవడం నిజమైన గౌరవం, ఆనందం అని బిష్ణోయ్ హిందీలో ట్వీట్ చేశారు. `ఆయన ఒక నిజమైన రాజనీతిజ్ఞుడు. నాతో సంప్రదింపుల్లో ఆయన చరిస్మాకు పడిపోయాను. భారత్ పట్ల ఆయన విజన్ స్ఫూర్తి దాయకం` అని పేర్కొన్నారు.
జేపీ నడ్డాతో భేటీ కావడం `చాలా గర్వంగా` ఉంది అని బిష్ణోయ్ వ్యాఖ్యానించారు. నడ్డా హయాంలో బీజేపీ అసాధారణ స్థాయిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తన మద్దతుదారులతో సంప్రదించిన తర్వాత, హర్యానా ప్లస్ తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని చెప్పారు.