చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వే చేసిన పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 76-90 సీట్లు, అధికార కాంగ్రెస్‌కు 19-31, శిరోమణి అకాలీదళ్‌కు 7-11 సీట్లు, ఇతరులకు 1-4 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మరొక ప్రముఖ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం, ఆప్‌కు సుమారు 51-61 సీట్లు, కాంగ్రెస్‌కు 22-28, శిరోమణి అకాలీదళ్‌కు 20-26, ఇతరులకు 8-14 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ-ఓటర్ పేర్కొంది.
టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ 70 సీట్లు, కాంగ్రెస్ 22, ఎస్ఏడీకి 19, బీజేపీ-మిత్రపక్షాలు 5, ఇతరులు 1 సీటు చొప్పున గెలుచుకుంటాయని అంచనా వేసింది. న్యూస్ 24-టుడేస్ చాణక్య అంచనా ప్రకారం ఆప్ 89-111, కాంగ్రెస్ 3-17, ఎస్ఏడీ 1-11, ఇతరులు 0-2 సీట్లు గెలుచుకోనున్నాయి. రిపబ్లిక్-పి మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ 62-70, కాంగ్రెస్ 21-31, ఎస్ఏడీ 16-24, ఇతరులు 1-3 సీట్లు సాధించనున్నాయి.
మరోవైపు పంజాబ్ సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్ వైపు ఆ రాష్ట్ర ప్రజలు మొగ్గుచూపినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాలకు ఫిబ్రవరి 20న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.