EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ (System Upgrade) తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పులవల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన సేవలను ప్రభుత్వానికి చెందిన ‘ఉమంగ్’ (UMANG) యాప్‌కు బదిలీ చేసింది.
ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్, కొత్త యూఏఎన్ జనరేషన్ వంటివి ఇకపై ఉమంగ్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటికి ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త మార్పులు, వాటి ప్రభావంపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఉమంగ్ యాప్‌కు యూఏఎన్ సేవలు..
ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఇది ప్రధానమైనది. ఖాతాదారుల గుర్తింపును మరింత పటిష్టంగా ధ్రువీకరించుకోవడానికి, సేవలను సురక్షితంగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పీఎఫ్ సభ్యులు తమ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సాధ్యంకాదు. దానికి బదులుగా కింది పద్ధతిని అనుసరించాలి. మొదటగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఓపెన్ చేయాలి. అందులో ఈపీఎఫ్ఓ సర్వీసుల విభాగానికి వెళ్లాలి. ‘UAN Services Through Face Auth’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘UAN Activation’ పై క్లిక్ చేయాలి. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తిచేసి, స్క్రీన్‌పై వచ్చే సూచనలను పాటించాలి. ఈ వెరిఫికేషన్ విజయవంతం కాగానే మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.
యూఏఎన్ లేని పాత సభ్యుల పరిస్థితి..!
ఇప్పటికే పీఎఫ్ ఖాతా ఉండి యూఏఎన్ కేటాయించని సభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కూడా ఉమంగ్ యాప్ ద్వారా కొత్త యూఏఎన్‌ను పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించాలి. ఆ తర్వాత అవసరమైన సభ్యుల వివరాలను నమోదు చేసి, ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను పూర్తిచేయాలి. ఇలా జనరేట్ అయిన కొత్త యూఏఎన్‌ను వారి పాత పీఎఫ్ ఖాతాతో లింక్ చేస్తారు. దీనివల్ల పాత ఖాతాలోని బ్యాలెన్స్ కొత్త యూఏఎన్‌కు సురక్షితంగా బదిలీ అవుతుంది.
మర్చిపోయిన యూఏఎన్‌ను పొందడం ఎలా..?
కొత్తగా అప్‌గ్రేడ్ అయిన పోర్టల్‌లో యూఏఎన్‌ను మర్చిపోయిన వారు తిరిగి పొందే ప్రక్రియను ఈపీఎఫ్ఓ సులభతరం చేసింది. దీనికోసం సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. గుర్తింపు లేదా చిరునామా రుజువు పత్రాన్ని అప్లోడ్ చేసి, మొబైల్‌కు వచ్చిన ఓటీపీని వెరిఫై చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వారి యూఏఎన్ వివరాలు తెలుసుకోవచ్చు.
డెత్ క్లెయిమ్‌ల సేవలో నో చేంజ్..
యూఏఎన్‌కు సంబంధించిన కొన్ని సేవలు ఉమంగ్ యాప్‌కు మారినప్పటికీ, డెత్ క్లెయిమ్‌లను దాఖలు చేసే సదుపాయం మాత్రం పాత ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోనే కొనసాగుతుంది. మరణించిన సభ్యుని నామినీలు లేదా లబ్ధిదారులు క్లెయిమ్ దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, రద్దు చేసిన చెక్కు లేదా పాస్‌బుక్ వంటి బ్యాంక్ ఖాతా రుజువు, సభ్యుని మరణ ధ్రువీకరణ పత్రం, అవసరమైతే లబ్ధిదారుని పుట్టిన తేదీ రుజువు వంటివి సమర్పించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను పీడీఎఫ్ (పీడీఎఫ్) ఫార్మాట్లో, 2ఎంబీ పరిమితికి మించకుండా, ఫైల్ పేరులో స్పేస్‌లు లేకుండా అప్లోడ్ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఉన్న యూఏఎన్లకుగానీ, పీఎఫ్ బ్యాలెన్స్లకుగానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం కొన్ని సేవలు పొందే వేదిక మాత్రమే మారింది. భవిష్యత్తులో ఎలాంటి అంతరాయాలు లేకుండా సేవలు పొందాలంటే, పీఎఫ్ సభ్యులందరూ తమ ఆధార్ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కేవైసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.