శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 02:38:17

కార్మికులపై కరోనాస్త్రం!

కార్మికులపై కరోనాస్త్రం!

 • లాక్‌డౌన్‌ కష్టాల నుంచి పరిశ్రమలను  గట్టెక్కించే నెపంతో కార్మిక చట్టాలకు తూట్లు
 • యూపీ, మధ్యప్రదేశ్‌ చర్యలు   
 • పనిగంటలు 12 గంటలకు పెంపు
 • హైర్‌ అండ్‌ ఫైర్‌కు యాజమాన్యాలకు స్వేచ్ఛ 
 • కార్మిక సంఘాల ధ్వజం

న్యూఢిల్లీ, మే 9: బీజేపీ పాలనలోని రెండు అతిపెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌.. కార్మిక చట్టాల్లో పలు కీలక సంస్కరణలు తేవడం ప్రస్తుతం చర్చనీయాంశమైనది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమలకు రాచబాట వేశాయి. ‘కార్మిక అడ్డంకుల’ను తొలిగించాయి. కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలిగించడంలో యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. అలాగే పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి. దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కాగా, కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు గుజరాత్‌లోని బీజేపీ సర్కార్‌ కూడా యూపీ, మధ్యప్రదేశ్‌ బాటలోనే నడవనున్నది. అయితే కర్ణాటకలోని కమలం సర్కార్‌ మాత్రం ఇందుకు విముఖత చూపుతున్నది. పనివేళలు పెంచడం వల్ల అటు పరిశ్రమలకు గానీ, ఇటు కార్మికులకు గానీ ఒరిగేదేమీ లేదని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివరామ్‌ హెబ్బర్‌ వ్యాఖ్యానించారు. అసలు ఉద్యోగాలే లేకపోతే పనివేళలు పెంచడం వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. 

కార్మికులకు శరాఘాతం

రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. ఈ సవరణలు కార్మికులకు శరాఘాతం. యాజమాన్యాలకు పూర్తి అధికారం కట్టబెట్టారు. చట్టాల్లో మార్పులు చేసేందుకు రాష్ర్టాలకు అనుమతినిస్తే, దేశంలో పారిశ్రామిక శాంతికి విఘాతం కలుగుతుంది.

- సాజి నారాయణన్‌, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ అధ్యక్షుడు

ఉత్తరప్రదేశ్‌లో..

 • పలు కార్మిక చట్టాల నుంచి మూడేండ్లపాటు పరిశ్రమలకు మినహాయింపు
 • భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం-1996, కార్మికుల పరిహార చట్టం-1923, బాండెడ్‌ లేబర్‌ సిస్టమ్‌ (అబాలిషన్‌) యాక్ట్‌-1976, వేతనాల చెల్లింపు చట్టంలో పలు సెక్షన్లు మాత్రమే అమల్లో ఉంటాయి.
 • ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ
 • ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

మధ్యప్రదేశ్‌లో

1.హైర్‌ అండ్‌ ఫైర్

‌100 మంది వరకు కార్మికులున్న పరిశ్రమలు తమ అవసరాల మేరకు కార్మికులను నియమించుకోవచ్చు.50 మంది వరకు కార్మికులున్న కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. 

2.తనిఖీలకు చెల్లు

 • 3నెలల వరకు పరిశ్రమల్లో తనిఖీలు ఉండవు.
 • థర్డ్‌ పార్టీ తనిఖీలకు అనుమతి.

3. సులభంగా రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు

 • ఒక్కరోజులోనే రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు జారీ
 • 10 ఏండ్లకొకసారి ఫ్యాక్టరీ లైసెన్స్‌ రెన్యువల్‌
 • స్టార్టప్‌లకు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ అవసరం లేదు

4.షిఫ్ట్‌ వేళలు

 • పరిశ్రమల్లో పనివేళలు 8 నుంచి 12 గంటలకు పెంపు
 • ఓవర్‌టైమ్‌ 72 గంటల వరకు అనుమతి; 
 • ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు పరిశ్రమలు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి


logo