Elon Musk : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచేందుకు తమ సంస్థకు చెందిన స్టార్‌లింక్ సేవలు ఉపయోగపడుతాయని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. దేశంలో అందుబాటులో ఇంటర్నెట్ సేవల గురించి ఒక యూజర్ ఎక్స్‌లో ఎలాన్ మాస్క్‌ను ట్యాగ్ చేయగా.. దీనికి మస్క్ బదులిచ్చాడు. ఇండియాలో ఇంకా సరైన నెట్వర్క్ కనెక్టివిటీ లేని చోట తన స్టార్‌లింక్ సంస్థ బూస్ట్ ఇస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మస్క్ సమాధానమిచ్చాడు.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కో కంపెనీయే స్టార్‌లింక్. ఇది శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, కేబుల్స్, టవర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందించగలదు. ఇప్పటికే అనేక దేశాల్లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇండియాలో కూడా ఈ సేవలు ప్రారంభం కావాలి. ఇందుకోసం సంస్థ గతంలో అనుమతివ్వాలని కోరుతూ కేంద్రానికి దరఖాస్తు కూడా చేసింది. అయితే, స్టార్‌లింక్ ఉపయోగిస్తున్న ప్రీక్వెన్సీలు ఇండియా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతోపాటు ఈ సేవల ధరల విషయంలో స్పష్టత లేకపోవడం, దీని కిట్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి రావడం, భద్రతా కారణాల రీత్యా కేంద్రం స్టార్‌లింక్ సేవలకు అనుమతివ్వలేదు.
అయితే, ఇప్పుడు కేంద్రానికి మరోసారి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్ఇ)కి స్టార్‌లింక్ మరోసారి దరఖాస్తు చేసింది. తమ రెండవ జనరేషన్ శాటిలైట్‌కు అనుమతివ్వాలని కోరింది. ఇది గతంలోకంటే మరింత మెరుగ్గా పని చేస్తుంది. నేరుగా డివైజ్‌తో కనెక్ట్ అవుతుంది. ఈ సంస్థ తక్కువ కక్షలో శాటిలైట్లను ప్రయోగించి, వాటి ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో నుంచి సేవలందిస్తుంది. ఇతర శాటిలైట్లు దాదాపు 36,000 కిలోమీటర్ల దూరం నుంచి పని చేస్తాయి. స్టార్‌లింక్ శాటిలైట్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల లేటెన్సీ కూడా తగ్గుతుంది.
దీంతో ఇంటర్నెట్ సులభంగా వాడుకోవచ్చు. అయితే, స్టార్‌లింక్ ధరలు భారీగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఇందుకు సంబంధించిన వివరాల్ని తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందుకోసం బ్రాడ్‌బ్యాండ్ వాడాలంటే నెలకు రూ.8,600 చెల్లించాలి. అలాగే, హార్డ్‌వేర్ కిట్ కోసం రూ.34,000 చెల్లించాలి. అయితే, ఈ ధరలే ఫైనల్ కాదని తర్వాత సంస్థ తెలిపింది. మరోవైపు భారీ వినియోగాన్ని కూడా ఈ సంస్థ నిర్వహించలేదనే ప్రచారం ఉంది. చాలా తక్కువ మంది వాడేలా, సాధారణ కనెక్టివిటీ లేని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే స్టార్‌లింక్ సేవలు అందించగలదనే ప్రచారం ఉంది.