Gautam Singhania | ఎలక్ట్రానిక్ వాహనాలపై రేమండ్ గ్రూప్ చైర్మన్, భారత తొలి సూపర్ కార్ క్లబ్ వ్యవస్థాపకుడు గౌతమ్ హరి సింఘానియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ వాహనాలను రాజకీయంగా ప్రమోట్ చేస్తున్నారని.. వాటిని బొమ్మల్లాగే చూడాలంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఈవీ వాహనాలను నడపడం ఇష్టమా? అని ప్రశ్నించగా.. ఆయన నిర్మొహమాటంగా స్పందిస్తూ.. తాను వాటి గురించి ఆలోచించని స్పష్టం చేశారు. ఈవీ కార్లను బొమ్మలతో పోల్చిన ఆయన.. తనకు నాలుగు సంవత్సరాల వయసులో తన దగ్గర బ్యాటరీ నడిచే కారు ఉండేదని.. ఇప్పుడు ఈవీల గురించి ఎందుకు గొడవ? అప్పటి నా కారు కూడా ఈవీయే అని వ్యాఖ్యనించారు.
మోటార్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ఈ క్రీడను ప్రోత్సహించడానికి పూర్తి పర్యావరణ వ్యవస్థ అవసరమన్నారు. ఇక్కడ మోటార్ స్పోర్ట్స్ సాధన చేయడం లేదన్నారు. ఇక్కడ క్రికెట్‌ను గల్లీలో ఆడుతారని.. ఇది జీవన శైలిలో భాగమన్నారు. తన కూతురు బెల్జియంలో రైడ్ చేస్తుందని.. ఎందుకంటే ఎక్కడ ఓ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. తాను యూకేలో ఉంటే ప్రతిరోజూ రేసింగ్ చేయగలనన్నారు. సూపర్ కార్లపై తనకున్న మక్కువ గురించి మాట్లాడుతూ.. అలాంటి కార్లను నిర్మించడం అంత సులభం కాదన్నారు. సూపర్ కార్లను తయారు చేసే బ్రాండ్లు చాలా తక్కువ అన్నారు. కారును డెలివరీ చేయడానికి రెండు నుంచి మూడేళ్లు పడుతుందన్నారు. తాను కారును ఉదయం 7 గంటలకు నడుపుతానని.. అప్పుడే నిజమైన ఆనందం ఉంటుందన్నారు.
రక్షణ, అంతరిక్ష రంగాలపై మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అవకాశాలను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ దిశలో అనేక ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా అనిశ్చితంగా ఉందని.. భారత్‌లో మధ్యతరగతి, వారి ఆకాంక్షలు పెరుగుతున్న కొద్దీ, ప్రజలు సరసమైన లగ్జరీని కోరుకుంటున్నారన్నారు. భారతదేశం ఏరోస్పేస్, రక్షణ తయారీకి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. తాము యూఎస్‌లో పని చేయకూడదని నిర్ణయించుకున్నామని.. ఎందుకంటే తమకు అనిశ్చితి ఇష్టం లేదన్నారు. చివరగా రేమండ్‌ను లగ్జరీ బ్రాండ్ అని పిలువచ్చా? అని సింఘానియాను ప్రశ్నించగా.. తిరస్కరించారు. తాము మార్కెట్ మధ్యలోనే ఉన్నామని.. లగ్జరీ మాత్రం కాదన్నారు.