తిరువనంతపురం, డిసెంబర్ 1: ‘మసాలా బాండ్’ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ నుంచి రూ.466 కోట్ల షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయనతోపాటు ఆ రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్, సీఎం ముఖ్య కార్యదర్శి కేఎం అబ్రహంలకు ‘ఫెమా చట్టం’ కింద కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఓ వైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ పరిణామం చోటుచేసుకోవటం రాజకీయ దుమారం రేపింది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘మసాలా బాండ్’ కేసు విపక్షాల చేతికి ఓ అస్త్రంగా మారనున్నది. ఈడీ నోటీసులు.. ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు వేసిన ఎత్తుగడగా ఎల్డీఎఫ్ కూటమి పేర్కొన్నది. విజయన్ సర్కార్ 2019లో ఏర్పాటుచేసిన ‘కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్’ మసాలా బాండ్స్ ద్వారా రూ.2,150 కోట్లను సేకరించింది. నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తును ‘మసాలా బాండ్స్’ కేసుగా పేర్కొంటున్నారు.