న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దెబ్రాయ్ (69) ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. పేగులు పని చేయడంలో అవాంతరాలు ఏర్పడటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం రాత్రి చేర్పించారు. ఆయన హైపర్‌టెన్షన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు సంబంధించిన సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. దెబ్రాయ్ శిఖర సమానుడైన విద్యావేత్త అని కొనియాడారు.
ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి అనేక రంగాల్లో ఆయనకు గట్టి పట్టు ఉందన్నారు. బిబేక్ దెబ్రాయ్కి 2015లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 2019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యునిగా ఉన్నారు. ఆయన అనేక పుస్తకాలను రచించారు. సంపాదకీయాలు, ప్రజాదరణ పొందిన వ్యాసాలను రాశారు. చాలా వార్తా పత్రికలకు కన్సల్టింగ్/కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు.