ECINET | కేంద్ర ఎన్నికల సంఘం కోట్లాది మంది ఓటర్లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల కోసం సరికొత్త యాప్‌ని తీసుకురాబోతున్నది. త్వరలోనే ఈసీఐనెట్ (ECINET) సింగిల్ ప్లాట్‌ఫామ్ యాప్‌ను ప్రారంభించనున్నది. దాంతో ఎన్నికలకు సంబంధించిన సేవలన్నీ ఒకే చోటకు రానున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ప్రస్తుతం 40 వేర్వేరు యాప్స్ ఉన్నాయి. కొత్త యాప్‌తో అన్ని సేవలు ఒకే యాప్‌లోకి రానున్నది. ఈసీఐనెట్ యాప్ ప్రత్యేకంగా మెరుగైన యూజర్ ఇంటర్ఫేస్, సరళమైన యూజర్ అనుభవం రూపొందించింది. యాప్ సహాయంతో ఓటర్లు, ఎన్నికలు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్సెస్ చేసుకునే వీలుండనున్నది.
ఇకపై మళ్లీ వేర్వేరు యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి అవసరం ఉండదు. ఆయా యాప్స్ పాస్‌వర్డ్‌లను సైతం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పూర్తి సమాచారం మొబైల్, డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఆధ్వర్యంలో సీఈవోల సమావేశంలో యాప్‌పై చర్చించారు. ఈసీఐనెట్ ద్వారా యూజర్లు మొబైల్, డెస్క్‌టాప్ ద్వారా ముఖ్యమైన ఎన్నికల సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ యాప్‌లో అప్లోడ్ చేయబడిన మొత్తం సమాచారాన్ని అధీకృత ఎన్నికల అధికారులు మాత్రమే నమోదు చేస్తారు. ఎన్నికల కమిషన్ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, ఓటరు టర్నౌట్ యాప్, సీవిజిల్, సువిధ 2.0, ఈఎస్ఎంఎస్, సక్షమ్, కేవైసీ యాప్ తదితర కీలకమైన యాప్స్ ఈసీఐనెట్‌లో విలీనం కానున్నాయి.
ఈ యాప్‌లను ఇప్పటివరకు 5.5 కోట్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈసీఐనెట్ 100కోట్లకుపైగా ఓటర్లతో పాటు 10.5లక్షల బూత్ లెవల్ అధికారులు, 15 లక్షలకు పైగా రాజకీయ ఏజెంట్లు, 45 లక్షలకుపైగా పోలింగ్ అధికారులు, 15,597 అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 4,123 ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, దేశవ్యాప్తంగా 767 జిల్లా ఎన్నికల అధికారులు (DEOs) ఈ యాప్‌తో అనుసంధానమవుతారు. యాప్ కార్యాచరణ, వాడుకలో సౌలభ్యం, సైబర్ భద్రత విషయంలో కఠినమైన టెస్టులు జరుగుతున్నాయి. 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సీఈవోలు, 676 డీఈఓలు, 4,123 ఈఆర్వోలతో సంప్రదించాక ఈ యాప్‌ని అభివృద్ధి చేస్తున్నది.