న్యూఢిల్లీ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ‘సర్’ ప్రారంభ దశలో ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో చేర్చినట్టు తాను పేర్కొన్న 16.18 లక్షల మంది ఓటర్ల వివరాలను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గోప్యంగా ఉంచింది. చట్టప్రకారం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లో బూత్‌ల వారీగా దావాలు, అభ్యంతరాల జాబితాను ‘ఫొటో లేకుండా వ్యక్తిగత దరఖాస్తు ఫామ్ వరకు వివరాలు కనిపించేలా’ ప్రచురించాలి. అయితే ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న ఈ 16.18 లక్షల మందికి సంబంధించిన వివరాలు, జాబితా ఉత్తరప్రదేశ్ సీఈవో వెబ్సైట్లో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దేశంలోని అత్యధిక జనాభా గల రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఈ చట్ట ఉల్లంఘన జరిగింది. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని ప్రజల నుంచి వచ్చిన 71.38 లక్షల దరఖాస్తుల వివరాలను ఈసీఐ తన వెబ్సైట్లో ప్రచురించింది. వీటిలో అత్యధికులు ముసాయిదా జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిన వారే ఉన్నారు.
దీనికి భిన్నంగా ఈసీఐ తుది జాబితాలో 84.3 లక్షల మంది ఓటర్లను చేర్చింది. దరఖాస్తు చేసుకున్న వారు, ఈసీఐ వివరాలు వెల్లడించిన సంఖ్యతో పోలిస్తే అదనంగా మరో 12.92 లక్షల మంది ఓటర్లు అందులో చేర్చబడ్డారు. ఇది చట్టపరంగా అసాధ్యం. ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే ఈసీఐ ఓటర్ల జాబితాలో చేర్చగలదు. ఓటర్ల జాబితాలో చేర్చబడిన వారి సంఖ్య దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను మించకూడదు. ముసాయిదా జాబితా నుంచి ఓటర్లను తొలగించమని ఈసీఐకి కొన్ని లక్షల దరఖాస్తులు కూడా అందాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ అదనపు ఓటర్ల జాబితా నమ్మశక్యంగా లేదు. అయితే, ముసాయిదా జాబితా తయారవ్వడానికి ముందే 16.18 లక్షల మంది ఓటర్లు జాబితాలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారని మార్చి 7 నాటి పత్రికా ప్రకటనలో ఈసీఐ పేర్కొంది.
సర్ కింద ముసాయిదా జాబితాను రూపొందించిన తర్వాత తమ పేర్లు తొలగించారా, గల్లంతైనట్టు ప్రకటించారా, మరణించినట్టు ప్రకటించారా, వేరే చోటికి తరలించారా లేదా డూప్లికేట్ జాబితానా అనే విషయాలు ప్రజలకు తెలుస్తాయి. అయితే ఈ ముసాయిదా జాబితాను బహిర్గతం చేయడానికి ముందే 16.18 లక్షల మంది ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకున్నారని ఈసీఐ తెలిపింది. ఈ దశలో దరఖాస్తు చేసుకునేవారు కేవలం ఓటు హక్కు పొందే వయసు వచ్చిన పౌరులు మాత్రమే. చట్ట ప్రకారం పేర్లను చేర్చడం లేదా తొలగించడం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను బహిర్గతం చేయాలి. తద్వారా ఆ దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇతరులు పరిశీలించే అవకాశం ఉంటుంది. యూపీ ఎన్నికల అధికారులు ఈ డాటాను అందించడంలో విఫలమైనందున ఈ ఓటర్లు ఎవరో, వారిని ఏ అసెంబ్లీ నియోజకవర్గాలకు లేదా పోలింగ్ బూత్‌లకు చేర్చారో లేదా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి వారి అర్హతను ధృవీకరించిందో లేదో నిర్ధారించడం ఇకపై ఎవరికీ సాధ్యం కాదు.