కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాపై బంగ్లాదేశ్ అశాంతి ప్రభావం పడింది. (Bangladesh unrest) 15 రోజులుగా వ్యాపారాలు బంద్ అయ్యాయి. దీంతో కోల్‌కతాలోని సుమారు 500 మంది వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కోల్‌కతాకు వచ్చే చాలా మంది బంగ్లాదేశీయులు నగరంలోని మార్క్విస్ స్ట్రీట్, కైడ్ స్ట్రీట్, ఎస్ప్లానేడ్, న్యూమార్కెట్ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాల్లోని వ్యాపారులు బంగ్లాదేశ్ పౌరులపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. విదేశీ కరెన్సీ మార్పిడి కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు, వీసా సహాయ కేంద్రాలు, బస్సు, రైలు, విమాన టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలు, హోటళ్ళు, రెస్టారెంట్లతోపాటు చిన్న, పెద్ద వ్యాపారాలు ఈ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పర్యాటకులే కాకుండా వైద్యం కోసం కూడా బంగ్లాదేశ్ నుంచి అనేక మంది ప్రజలు కోల్‌కతాకు వస్తుంటారు.
కాగా, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటాపై బంగ్లాదేశ్‌లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా సోమవారం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్‌కు చేరుకున్నారు. దీంతో ఆ దేశంలో ప్రభుత్వం కూలి రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఆర్మీ పెత్తనం చెలాయిస్తోంది.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతాకు బంగ్లాదేశ్ సందర్శకుల రాక నిలిచిపోయింది. దీంతో వారిపై ఆధారపడిన పలు వ్యాపారాలు ప్రభావితమయ్యాయి. గత 15 రోజులుగా వ్యాపారం క్షీణించింది. షేక్ హసీనా పరార్ నేపథ్యంలో సోమవారం నుంచి కోల్‌కతా వ్యాపారవేత్తలు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
కాగా, కోల్‌కతాలోని విదేశీ కరెన్సీ మార్పిడి కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీల పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే బంగ్లాదేశీయులపై పూర్తిగా ఆధారపడిన కోల్‌కతాలోని హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు ముకుందాపూర్‌లోని అనేక ఆసుపత్రులు కూడా రోగులు లేక బోసిపోయాయి. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే తప్ప తమ వ్యాపారాలు కొనసాగవని వ్యాపారులు వాపోతున్నారు.