Kharga Kamikaze Drone | న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆధునిక యుద్ధ క్షేత్రంలో శత్రువును కకావికలం చేసే రెండు కొత్త డ్రోన్లు భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి. బాజ్, ఖర్గే అనే ఈ డ్రోన్లను ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో జరిగిన ‘ఇన్నో-యోధ 2024-25’ సెమినార్లో ప్రదర్శించారు. భారత ఆర్మీ తయారుచేసిన 22 ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించగా ఈ రెండు డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిఘాతో పాటు శత్రువులపై దాడి చేయగల ఈ డ్రోన్లు భారత సైన్యానికి కీలక అస్ర్తాలుగా మారనున్నాయి.
‘ఖర్గ’ అనే కామికాజ్ డ్రోన్ శత్రువుల కేంద్రాలపై సునాయాసంగా దాడి చేయగలదు. అందుకే దీనిని సూసైడ్ డ్రోన్‌గా పిలుస్తున్నారు. కేవలం రూ.30 వేలతో ఈ డ్రోన్‌ను భారత ఆర్మీ తయారుచేసింది. సెకనుకు 40 మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్ జీపీఎస్‌తో పాటు ఒకటిన్నర కిలోమీటరు రేంజ్‌తో కూడిన హెచ్డీ కెమెరా కలిగి ఉంటుంది. 700 గ్రాముల పేలుడు పదార్థాలను ఇది మోసుకెళ్లగలదు. రాడార్‌కు చిక్కకుండా వెళ్లి దాడి చేయడం దీని ప్రత్యేకత.
ఈ డ్రోన్ కేవలం ఆకాశంలోకి ఎగరడమే కాదు శత్రువులపై దాడి చేయగలదు. రాకెట్ లాంచర్లను, చిన్న ఆయుధాలను, గ్రనేడ్ లాంచర్లను పేల్చగలదు. లక్ష్యాలపై మోర్టార్ బాంబులను, పేలు పదార్థాలను వేయగలదు. ఆంగ్ల అక్షరం ‘హెచ్’ ఆకారంలో దీని డిజైన్ ఉండటం వల్ల రాకెట్లు వెనక్కు పేలే ప్రమాదం ఉండదు. 20 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్ 50 కిలోలను మోసుకెళ్లగలదు. శత్రువుల ట్యాంకులు, బంకర్లను ధ్వంసం చేయడంతో పాటు రోడ్డుమార్గం లేని ప్రాంతాల్లో మన బలగాలకు వస్తువులను చేరవేయగలదు.