Drone missing : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీరట్ (Meerut) నగరంలో ఆర్మీ (Army) కి చెందిన ఓ డ్రోన్ (Drone) మిస్సయ్యింది. డ్రోన్ మిస్సయ్యిందని ‘కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (Corps of Electronics and Mechanical Engineers)’ కు చెందిన టెక్నీషియన్ హవల్దార్ మేజర్ దీపక్ రాయ్ (Technician Havildar Major Deepak Roy) రైల్వేరోడ్ పోలీస్‌స్టేషన్ (Railway Road police station) లో ఫిర్యాదు చేశారు. రోజువారి శిక్షణ కార్యక్రమంలో భాగంగా డ్రోన్‌ను పైకి పంపగా కొంతసేపటి తర్వాత అది కనిపించకుండా పోయిందని తెలిపారు.
మీరట్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం సాయంత్రం డ్రోన్ మిస్సయ్యిందని దీపక్ రాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు గురించి సదార్ సర్కిల్ ఆఫీసర్ సంతోష్‌కుమార్ సింగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘ఆర్మీ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. డ్రోన్ రోహ్తా రోడ్ ఏరియాలో గాల్లో ఎగురుతూ రైల్వే లైన్ దాటింది. ఆ తర్వాత దిశను మార్చుకుని కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కంట్రోల్ మానిటర్‌తో ఆ డ్రోన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎంత వెతికినా డ్రోన్ జాడ దొరకలేదు.’ అని సర్కిల్ ఆఫీసర్ చెప్పారు.
అయితే కనిపించకుండా పోయిన డ్రోన్‌కు కెమెరాగానీ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) గానీ లేదని, రోజువారి శిక్షణలో ఈ డ్రోన్‌ను వినియోగించేవాళ్లమని హవల్దార్ రాయ్ తెలిపారు. సోమవారం సాయంత్రం వీచిన బలమైన దాడుల కారణంగా కంట్రోల్ మానిటర్‌తో ఆ డ్రోన్ సంబంధాలు కోల్పోయిందని రాయ్ చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.