Stalin | తమిళనాడు ఆపద్ధర్మ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్(M K Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే(TVK) ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోపోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించి నందున ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. ఆరు నెలల విజయ్ పాలన చూసిన తర్వాతనే తాను మాట్లాడుతానని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమ పార్టీకి లేదన్నారు.
ఎన్నికల్లో టీవీకే ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.2,500 ఇవ్వడం అసాధ్యమని, గతంలో తాము ఇచ్చినట్లుగా 1000 రూపాయలు ఇవ్వాలన్నారు. అలాగే డీఎంకే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిచాలని సూచించారు. కాగా, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 107 సీట్లు.
విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టీవీకే బలం 107 మాత్రమే. మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దాంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలోనే మెజారిటీ లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.