Siddaramaiah : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పుపై ఊపందుకున్న ఊహాగానాలకు ఇటీవల తెరపడినట్లే పడినా.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వర్గం, అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) వర్గం ఎవరికి వారే మొండిపట్టు మీద ఉన్నారు.
ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య, సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే శివకుమార్ బయటికి ప్రకటించినా లోపల మాత్రం లొసుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చి రెండు వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా సిద్దరామయ్య మాట్లాడుతూ.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య కట్టుబడి ఉండాలని అన్నారు.
అధిష్ఠానం నిర్ణయాన్ని ఇద్దరం అంగీకరించి తీరాల్సిందేనని చెప్పారు. హైకమాండ్ నిర్ణయానుసారమే తాము నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఐదు నెలల క్రితం తాము హైకమాండ్‌ను కలిసినప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించాలని సూచించారని, అందుకు తాను రెండున్నరేళ్ల పాలన ముగిసిన తర్వాత విస్తరణ చేస్తామని చెప్పానని, ఆ మేరకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తు చేస్తున్నామని సిద్ధూ తెలిపారు.