పాట్నా: జూనియర్ పోలీస్ అధికారుల పని తీరుపై అసంతృప్తి చెందిన ఎస్పీ వారిని రెండు గంటలపాటు లాకప్‌లో ఉంచాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో పోలీస్ సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. బీహార్‌లోని నవాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవాడ ఎస్పీ గౌరవ్ మంగళ ఈ నెల 8న (గురువారం) రాత్రి 9 గంటలకు నవాడ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కొందరు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐలు) శత్రుఘ్న పాశ్వాన్, రామ్రేఖా సింగ్‌తోపాటు ముగ్గురు ఏఎస్ఐలు సంతోష్ పాశ్వాన్, సంజయ్ సింగ్, రామేశ్వర్ ఉరాన్ను రెండు గంటలపాటు లాకప్ లోపల ఉంచారు. అర్ధరాత్రి తర్వాత వారిని లాకప్ నుంచి బయటకు పంపారు. ఈ విషయంతోపాటు వీడియో క్లిప్ బయటకు వచ్చింది. అయితే ఇది తప్పుడు వార్త అని ఎస్పీతోపాటు ఆ పోలీస్ స్టేషన్ ఇంచార్జి అధికారి బుకాయించారు.
కాగా, లాకప్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బీహార్ పోలీస్ సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. దీంతో బీహార్ పోలీస్ సంఘం సీరియస్ అయ్యింది. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ సింగ్ శనివారం డిమాండ్ చేశారు. దీనిపై నోరు విప్పవద్దంటూ పోలీస్ సిబ్బందిపై ఆ ఎస్పీ ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపర్ అయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమీర్ సుభానీ ఈ సంఘటనపై స్పందించారు. తమ కింద పనిచేసే ఉద్యోగులతో మంచిగా ప్రవర్తించాలని ఆదేశిస్తూ ఉన్నతాధికారులకు లేఖ జారీ చేశారు. ఎలాంటి కారణం లేకుండా అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించడం, వేధింపులకు గురిచేయడాన్ని సహించబోమని హెచ్చరించారు. అసమంజసమైన సస్పెన్షన్, శాఖాపరమైన చర్యలను మానసిక వేధింపులుగా పరిగణిస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
बिहार पुलिस का हाल
नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb
— UnSeen India (@USIndia_) September 10, 2022