న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి రైలు ప్రయాణికులు ఉలిక్కిపడుతున్నారు. ఈరోడ్-జోగ్బాని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16601)లో ఒక వ్యక్తి ఆహార పదార్ధాలను సరఫరా చేసే డిస్పోజబుల్ కంటైనర్లను వాష్ బేసిన్లో కడుగుతున్న దృశ్యం ఈ వీడియోలో కన్పిస్తున్నది. తిన్న తర్వాత పారేసిన ఈ డిస్పోజబుల్ కంటైనర్లను కడగటమేమిటని వారు విస్తుపోతున్నారు.
బహుశా వాటిని తిరిగి వాడేందుకే వాటిని కడుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యం భారత రైళ్లలోని ఆహార శుభ్రత భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల ఆరోగ్యంపై అధికారులకు ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో చర్చకు దారితీసింది. ‘మారు వేషంలో ఉన్న మురికి.. ఎక్స్ప్రెస్ రైళ్లలో సేవగా’ ఇస్తున్నారు, అందుకోండి అంటూ పలువురు నెటిజన్లు ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.