న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. గత వారం రోజుల నుంచి వరుసగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తూ వస్తున్నది. దాంతో ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంటున్నది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ ఢిల్లీలో గాలి నాణ్యత సగటు 332గా ఉన్నది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర వాయు కాలుష్యానికి నిదర్శనం. మంగళవారం కూడా ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో AQI 371గా, పుసా ఏరియాలో AQI 341గా, ధిర్పూర్ ఏరియాలో AQI 460గా, నోయిడాలో AQI 438గా నమోదయ్యింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.