న్యూఢిల్లీ: దొంగ సొమ్ముతో లేచిపోయి పెండ్లి చేసుకుందామని భావించిన ఓ ప్రేమ జంట ప్లాన్ను ఢిల్లీ పోలీసులు చెదరగొట్టారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని షాలిమార్ బాగ్కు చెందిన చేతన్ అనే వ్యక్తి గురువారం పోలీసులకు ఫోన్ చేసి తన తల్లి లోపలి నుంచి గడియ వేసుకుని తలుపు తీయడం లేదని చెప్పాడు.
దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టగా లోపల రజినీ మదన్ (56) అనే మహిళ విగతజీవిగా పడివున్నారు. మృతురాలి కుమారుడు చేతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధుర్ కుంద్రా (31), అమర్జ్యోత్ కౌర్ (28)లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే ఆభరణాలు, రూ.14.4 లక్షల నగదును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మధుర్ కుంద్రా మృతురాలి బంధువుగా పోలీసులు గుర్తించారు. ఆ చనువుతోనే నిందితుడు అమర్జ్యోత్ కౌర్పాటు ఇంట్లోకి ప్రవేశించి రజినీ మదన్ హత్య చేశాడని, ఆ తర్వాత ఇంట్లోని ఆభరణాలు, నగదును తీసుకుని బయటి దర్వాజా లోపలి నుంచి గడియపెట్టి, వెనుక దర్వాజా గుండా పారిపోయారని చెప్పారు.
నిందితులిద్దరూ లవర్స్ అని, దొంగతనం అనంతరం ఎక్కడికైనా పారిపోయి పెండ్లి చేసుకోవాలని వారు భావించారని, తమ ఇంటరాగేషన్లో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారని డీసీపీ రోహిత్ మీనా తెలిపారు. పరుల సొమ్ముతో లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఆశపడి, జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని ఆయన చెప్పారు.