Air india | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air india)కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ ఇటీవలే అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే మరిన్ని విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి.
సాంకేతిక లోపాల కారణంగా ఇప్పటికే పలు విమానాలు రద్దైన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోనూ అదే పరిస్థితి తలెత్తింది (Delhi – Paris air india flight cancelled). ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 143 రద్దు చేసినట్లు తెలిపింది. ముందస్తు విమాన తనిఖీల్లో సమస్యను గుర్తించినట్లు పేర్కొంది. ఫలితంగా బుధవారం పారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా AI 142ను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. హోటల్ వసతి సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు తెలిపింది.
కాగా, ఇవాళ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ సాంకేతిక సమస్య కారణంగా తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం AI 159 మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి అది లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరాల్సి ఉంది. అయితే, టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తెలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసును చివరి నిమిషంలో రద్దు చేశారు.
సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇవాళ ఉదయం కూడా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో విమానాన్ని నిలిపివేశారు. దీంతో భద్రత దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలోని ఇంజిన్లలో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. ఇలా వరుస ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Also Read..
Air India plane crash | విమాన ప్రమాదం.. ఘటనాస్థలి నుంచి 70 తులాల బంగారం, నగదు స్వాధీనం
Air India Plane crash | బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు.. వెలుగులోకి కొత్త వీడియో
Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్యాన్సిల్