న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసివేకుండా కరోనా కట్టడి కోసం కొత్తగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పాఠశాలల్లో ప్రత్యేక క్వారంటైన్ గదులను సిద్ధం చేయడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల పరిస్థితులపై ప్రతి రోజూ సేకరించేలా చూస్తున్నది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించారు. అయితే, కొత్త ఎస్ఎపీని సిద్ధం చేసి, మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నాహాలు
చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఏడు పాయింట్లతో ఎస్ఓపీలను జారీ చేసింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ కరోనా నివారణపై చర్చించాలని ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు సైతం టీకా తీసుకునేలా ప్రోత్సహించాలి. పాఠశాలలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి ఉండేలా చూడాలి. వాష్ బేసిన్, నీరు తగినంత ఉండేలా ఏర్పాట్లు చేయాలి. పిల్లలు వచ్చి వెళ్లే సమయంలో అన్ని గేట్ల వద్ద రద్దీ లేకుండా ప్రధానోపాధ్యాయులు చూడాలని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడడంతో పాటు తరగతి గదులతో పాటు ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు లక్షణాలపై ఆరా తీయాలని సూచించింది. జ్వరం, చలి, దగ్గు, శ్వాస ఆడకపోవడం, కండరాల, ఒంటి నొప్పులు, తలనొప్పి, రుచి లేదంటే వాసన కోల్పోవడం, గొంతు మంట, ముక్కు కారడం, వాంతులు, అతిసారం తదితర లక్షణాలు ఎవరైనా కనిపిస్తే వారిని వేరు చేసి క్వారంటైన్ గదికి పంపాలని ఆదేశించింది. పిల్లల్లో, ఉపాధ్యాయులు, సిబ్బందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తాత్కాలికంగా మూసివేయడంతో పాటు మండలం లేదా జిల్లా అధికారికి తెలియజేయాలని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పాఠశాల గేట్ల వద్దనే పరీక్షలు చేయాలని చెప్పింది. తద్వారా కొవిడ్ లక్షణాలున్న పిల్లలను అక్కడికక్కడే ఇంటికి పంపొచ్చని పేర్కొంది.
తప్పనిసరిగా విద్యార్థులు, ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరికీ గేట్ వద్దనే థర్మల్ స్కానింగ్ పరీక్షలు చేయని స్పష్టం చేసింది. పాఠశాలకు హాజరైన సమయంలో ఉపాధ్యాయులు కొవిడ్‌పై పిల్లలతో మాట్లాడాలని తెలిపింది. ప్రతి పాఠశాలలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు వీలుగా క్వారంటైన్ గదిని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చూడడంతో పాటు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. క్యాంపస్ గెస్ట్ పాలసీని నిలిపివేయాలని, అత్యవసర సమయాల్లో అవసరమైన కొవిడ్ నిబంధనల మేరకు తల్లిదండ్రులకు మాత్రమే అనుమతివ్వాలని చెప్పింది. కొవిడ్ నివారణ కోసం అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పించాలని చెప్పింది.