న్యూఢిల్లీ: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు పోలీసులు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక వ్యక్తిని కొట్టి కిడ్నాప్ చేశారు. ఐదు లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించారు. అతడి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తూ పోయే ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
షాహదారాలోని జీటీబీ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి ఆదాయపు పన్ను శాఖలో సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి వేళ తన కారులో ఇంటికి తిరిగి వస్తున్నాడు. షహదారా ఫ్లైఓవర్ వద్ద తెలుపు రంగులో ఉన్న కారు అతడి కారును అడ్డగించి నిలువరించింది. ముగ్గురు వ్యక్తులు అతడి కారు వద్దకు వచ్చి కొట్టారు. అతడ్ని వెనక సీటులో కూర్చొమన్నారు. తాను క్రైమ్ బ్రాంచ్ పోలీసునని ఒక వ్యక్తి చెప్పాడు. మరోకరు తుపాకీ తీసి బెదిరించాడు. ఆ వ్యక్తి పర్సులో ఉన్న రూ.35,000 తీసుకున్నాడు. అతడ్ని ఐదు లక్షలు డిమాండ్ చేశారు. లేకపోతే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
అనంతరం అతడి కారులోనే షాహదారా జిల్లాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక పోలీస్ అధికారితో మాట్లాడిన తర్వాత అరెస్ట్‌కు ఆయన ఆదేశించినట్లు బెదిరించారు. వైద్య పరీక్షల కోసమంటూ జీటీబీ ఆసుపత్రి వద్దకు తీసుకుకెళ్లారు. అక్కడ డబ్బులు కోసం మరోసారి బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి వారిని తన ఇంటికి తీసుకెళ్లి మరో రూ.50,000 ఇచ్చాడు. అలాగే స్నేహితుడి నుంచి అప్పుగా రూ.70,000 తీసుకున్నాడు. నిందితుల్లో ఒకరి భార్య బ్యాంకు ఖాతాకు ఆ డబ్బులను పంపాడు. దీంతో వారు అతడ్ని వదిలేశారు.
కాగా, ఈ సంఘటన అనంతరం బాధిత వ్యక్తి బీటీబీ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు సీమాపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ సందీప్, రాబిన్ కాగా మరో వ్యక్తి వాహిద్.
ఢిల్లీ పోలీసులకు చెందిన మరో కానిస్టేబుల్ అమిత్, సీమాపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్న అనే మోసగాడు పరారీలో ఉన్నారు. ఈ కిడ్నాప్‌కు సూత్రధారి కానిస్టేబుల్ అమిత్ అని దర్యాప్తులో తేలింది. ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు అనుమానించి ఆయనపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.