Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాద కుట్రలో కీలకంగా ఉన్న మరో వ్యక్తిని అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వని అలియాస్ డానిష్‌ను అరెస్టు చేసింది. గతంలో అరెస్టు చేసిన అనుమానితులను విచారించిన, సాంకేతిక దర్యాప్తు ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా అరెస్టు చేసింది. ఎన్ఐఏ బృందం గత కొద్దిరోజులుగా కశ్మీర్లో లోయలో దాడులు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నది. ఈ సమయంలో జాసిర్ వాని ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించగా.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ గతంలో ఢిల్లీలో అరెస్టు చేసింది. పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరుతోనే రిజిస్టర్ అయ్యింది.
అతని నెట్వర్క్, ఇందులో పాల్గొన్న వ్యక్తుల కోసం ఎన్ఐఏ ఆరా తీస్తున్నది. కార్ బాంబు దాడికి ముందు డానిష్ ఉగ్రదాడులకు సాంకేతిక మద్దతు ఇచ్చాడు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజిగండ్ నివాసి అయిన నిందితుడు జాసిర్ వని ఈ దాడిలో యాక్టివ్ కుట్రదారుడు. ఉగ్రవాది ఒమర్ ఉన్ నబీతో కలిసి అతను ఈ ఉగ్రవాద మారణహోమాన్ని ప్లాన్ చేశాడు. కారు బాంబుకు ముందు రాకెట్ తయారు చేసినట్లుగా సమాచారం. వని డ్రోన్స్, రాకెట్ల తయారీలో నిపుణుడిగా గుర్తించారు. బాంబు దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఎన్ఐఏ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు బృందాలు ఆధారాల కోసం వెతుకుతున్నాయి. రాష్ట్రాల్లో దాడులు కొనసాగిస్తున్నాయి.