న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుది దాడి(Delhi Blast)కి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఆ కుట్రకు ప్లాన్ చేసిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ దానిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతన్ని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. పది రోజుల పాటు ఎన్ఐఏ అతన్ని కస్టడీలోకి తీసుకున్నది. కస్టడీ దర్యాప్తుకు అంగీకరిస్తూ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీ అంజూ బజాబ్ చందనా అనుమతి ఇచ్చారు. రిమాండ్ కోరేందుకు ఎన్ఐఏ కొన్ని ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఢిల్లీ బ్లాస్టు వెనుక దాగి ఉన్న భారీ కుట్రను తేల్చేందుకు జాసిర్ రిమాండ్ అవసరమని కోర్టు చెప్పింది. భారత పౌరుల్లో ఆ పేలుడు భయం కలిగించాని, దేశ సౌర్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని భావించారన్నారు. డ్రోన్ల వినియోగంలో జాసిర్ చాలా నిష్ణాతుడని ఎన్ఐఏ చెప్పింది. రాకెట్ల తయారీలోనూ అతను నిపుణుడని తెలుస్తోంది.
జాసిర్ బిలాల్ వానీ స్వస్థలం అనంత్‌నాగ్‌లోని ఖాజిగుండ్. సోమవారం శ్రీనగర్‌లో అతన్ని అరెస్టు చేశారు. టెక్నికల్ సపోర్టు ఇచ్చిన కేసులో అతన్ని అరెస్టు చేశారు. బాంబు పేలుడుకు ముందు అతను డ్రోన్లు, రాకెట్లను తయారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రకోట బ్లాస్టు కేసులో సహ కుట్రదారుడి పాత్రను జాసిర్ పోషించినట్లు ఎన్ఐఏ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. డాక్టర్ ఉమర్ నబీ తో అతను చాలా క్లోజ్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆమిర్ రషీద్ అలీ అనే వ్యక్తిని కూడా 10 రోజుల కస్టడీలోకి తీసుకెళ్లారు. నబీ కోసం సురక్షితమైన ఇంటిని, లాజిస్టిక్ సపోర్టు ఇచ్చినట్లు ఆమిర్‌పై ఆరోపణలు ఉన్నాయి.