Delhi Assembly : ఢిల్లీ (Delhi) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. ఫిబ్రవరి 24న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాలు మొదలవగానే ముందుగా ప్రొటెం స్పీకర్ (Protem Speaker) ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి కొత్త ఎమ్మెల్యేల (New MLAs) ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. ఆ తర్వాత లంచ్ విరామం ఉంటుంది. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ మొదలవగానే స్పీకర్ను ఎన్నుకుంటారు.
ఇక సమావేశాల రెండో రోజైన ఫిబ్రవరి 25న అసెంబ్లీలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. మూడో రోజైన ఫిబ్రవరి 27న ఉదయం నుంచి గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు.
కాగా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. సొంత మెజారిటీతో అధికారం దక్కించుకుంది. అధికార ఆప్ కేవలం 22 స్థానాలు మాత్రమే నెగ్గి ప్రతిపక్షంలో కూర్చుంది.