MP Sanjay Singh | ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 181 రోజుల తర్వాత ఏప్రిల్ 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన లిక్కర్ పాలసీ కేసు విషయంలో బీజేపీపై ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో బీజేపీ హస్తముందని ఆరోపించారు. ఈడీ దర్యాప్తు తర్వాత అసలు స్కామ్ మొదలైందన్నారు. ఇదిలా ఉండగా.. జైలులో ఉన్న సమయంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బరువు పెరిగినట్లు తీహార్ జైలు పరిపాలన పేర్కొంది.
2023 అక్టోబర్ 13న సంజయ్ సింగ్ జైలుకు వచ్చిన సందర్భంలో ఆయన బరువు 76 కిలోలుగా ఉండేదని జైలు అడ్మినిస్ట్రేషన్ నివేదికలో పేర్కొంది. బెయిల్పై బయటకు వచ్చే సందర్భంలో బరువు 82 కిలోలు ఉన్నట్లుగా తెలిపింది. అదే సందర్భంలో గతంలో 153/103 ఉన్న బీజేపీ.. 136/70కి తగ్గిందని చెప్పింది. సుమారు ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉన్న సమయంలో సంజయ్ సింగ్ బరువు సుమారు ఆరు కిలోలు పెరగ్గా.. బీపీ సైతం తగ్గింది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గారని ఆప్ నేతలు ఆరోపించారు. గత నెల 21న కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. అరెస్టు నుంచి 4.5 కిలోల వరకు తగ్గారని మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ వేగంగా బరువు తగ్గడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని ఆప్ వర్గాలు తెలిపాయి. కాగా, తీహార్ జైలు అధికారులు ఖండించారు. కేజ్రీవాల్ ఉన్న తీహార్ జైలుకు చేరిన సమయంలో ఆప్ అధినేత బరువు 65 కిలోలు ఉందని.. స్థిరంగానే ఉందని తెలిపింది. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని అధికారులు వివరించారు.