లక్నో: ముగ్గురు వ్యక్తులు దళిత యువకుడ్ని కొట్టారు. అతడితో బలవంతంగా మూత్రం తాగించారు. (Dalit Teen Forced To Drink Urine) ఆ యువకుడి కుటుంబం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల దళిత యువకుడు, అతడి కుటుంబం గ్రామంలో డీజే నిర్వహిస్తోంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సౌండ్, ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తారు.
కాగా, ఆ యువకుడు మంగళవారం రాత్రి ఒక ఫంక్షన్లో డీజే ఏర్పాటు చేశాడు. అయితే జనరేటర్లో ఇంధనం లేకపోవడంతో డీజే నిలిపివేశాడు. అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో ముగ్గురు వ్యక్తులు అతడితో ఘర్షణకు దిగారు. కార్యక్రమం తర్వాత ఇంటికి వెళ్తున్న యువకుడ్ని వారు అడ్డుకుని కొట్టారు. బాటిల్లో మూత్రం పోసి బలవంతంగా అతడితో తాగించారు. దీనిని వీడియో రికార్డ్ చేసి సర్క్యూలేట్ చేశారు.
మరోవైపు ఇంటికి చేరుకున్న ఆ యువకుడు ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలిపాడు. మరునాడు అతడి పేరెంట్స్, సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు కిషన్ తివారీ, దిలీప్ మిశ్రా, సత్యం తివారీని గురువారం అరెస్ట్ చేశారు. దిలీప్ మిశ్రా మద్యం బాటిల్లో మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యం, కిషన్ కలిసి ఆ యువకుడి నోటి వద్ద బాటిల్ ఉంచి బలవంతంగా మూత్రాన్ని తాగించారని చెప్పారు. వీడియో క్లిప్ చూసిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.