బాగా బీచ్.. గోవాలోనే చాలా ఫేమస్. జీవితంలో ఒక్కసారైనా గోవాకు వెళ్లి బాగా బీచ్‌లో ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను గోవాలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అందుకే.. గోవాకు వెళ్లాలనుకుంటే.. డిసెంబర్, జనవరి టైమ్‌లో అస్సలు వెళ్లకూడదు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఇదివరకు అంటే ఎంతమంది వెళ్లినా పెద్దగా ఇబ్బంది లేదు కానీ.. ఇది కోవిడ్ టైమ్ కదా. ఈ సమయంలో కూడా జనాలు ఏమాత్రం ఆలోచించకుండా, భయపడకుండా.. కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా.. కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవాకు చెక్కేశారు. దీంతో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనే జనంతో బాగా బీచ్ కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా జనాలే. వేల మంది రోడ్ల మీద, బీచ్‌లో ఎటువంటి కరోనా జాగ్రత్తలు లేకుండా తిరిగారు.
న్యూ ఇయర్ వేడుకల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాగా బీచ్‌లో జనాలు ఎంతలా కిక్కిరిసిపోయారో చూడండి అంటూ ట్విట్టర్లో ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వార్నీ.. వీళ్లకు కొంచెం కూడా కరోనా భయం లేదా.. కనీసం ఒమిక్రాన్ భయం కూడా లేదా. వీళ్లంతా న్యూ ఇయర్‌కు కాదు.. కోవిడ్‌కు వెల్కమ్ చెబుతున్నట్టుగా ఉంది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.