న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారమే వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదని స్పష్టంచేసింది. జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది.
గతంలో చెప్పినట్లుగానే జులై 31 నాటికి దేశవ్యాప్తంగా 51 కోట్ల డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేసి తీరుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జనవరి నుంచి జూలై చివరి నాటికి మొత్తం 51.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలో ఆరోగ్య శాఖ తెలిపింది. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ డోసులను కేటాయిస్తున్నామని పేర్కొన్నది.
ఇప్పటికే 45.7కోట్ల డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని, జూలై 31 నాటికి మిగతా 6.03 కోట్ల డోసుల పంపిణీ కూడా పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలకు సరఫరా చేసిన డోసుల్లోనూ ఇప్పటికే 44.19 కోట్ల వ్యాక్సిన్ డోసులు లబ్ధిదారులకు పంపిణీ జరిగినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 9.9 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారని స్పష్టంచేసింది.