న్యూఢిల్లీ, ఆగస్టు 7: గత మూడు నెలలకు పైగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అల్లర్ల బాధితులకు సహాయ, పునరావాస చర్యలు, వైద్య సదుపాయాలతోపాటు పరిహారం అందజేతపై పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వం వహిస్తారని, బాంబే హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలిని పీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ సభ్యులుగా ఉంటారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. ఈ కమిటీ సభ్యులు సహాయ శిబిరాలను సందర్శిస్తారని, అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారని తెలిపింది. అల్లర్లతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనపై ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ఈ చర్యలు తీసుకొన్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న మొత్తం పరిస్థితిని పర్యవేక్షించేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకొన్నది.
విశ్వాసం, నిష్పక్షపాత భావన కోసం..
మణిపూర్‌లో అల్లర్లు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేడీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన 11 ఎఫ్ఐఆర్లపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర మాజీ డీజీపీ దత్తాత్రే పద్సాల్గికర్ను నియమించింది. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు, నిష్పక్షపాత భావనను నిర్ధారించేందుకు సీబీఐ దర్యాప్తు బృందంలో ఇతర రాష్ర్టాలకు చెందిన కనీసం ఐదుగురు డిప్యూటీ ఎస్పీ ర్యాంకు అధికారులను డిప్యూటేషన్‌పై పంపాలని ఆదేశించింది. వీరంతా సీబీఐ పరిధిలోనే పనిచేస్తారని, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని తెలిపింది. తమకు అప్పగించిన విధులపై న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని మహిళా మాజీ న్యాయమూర్తుల కమిటీతో పాటు సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ అధికారికి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
సిట్లపై మణిపూర్యేతర అధికారుల పర్యవేక్షణ
ఇక రాష్ట్ర పోలీసుల దర్యాప్తు విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సీబీఐకి బదిలీ చేసినవి కాకుండా మిగతా కేసులపై దర్యాప్తునకు జిల్లాల వారీగా 42 రాష్ట్ర సిట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రతి సిట్‌లో ఇతర రాష్ర్టానికి చెందిన కనీసం ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండాలని ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్ర సిట్లను మణిపూర్యేతర రాష్ర్టాలకు చెందిన ఆరుగురు డీఐజీ ర్యాంకు అధికారులు పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది.
కోర్టు ముందుకు మణిపూర్ డీజీపీ
గత వారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ సోమవారం వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరయ్యారు. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన నమోదైన కేసులపై సీజేఐ ధర్మాసనం అడిగిన నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు. ఆగస్టు 1న విచారణ సందర్భంగా మణిపూర్‌లో రాజ్యాంగ యంత్రాం గం పూర్తిగా కుప్పకూలిపోయిందని, శాంతి భద్రతలు క్షీణించాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసుల నమోదు, విచారణ అంశంపై రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జస్టిస్ శాలిని జోషి: బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల అంశంపై లా డాక్టరేట్ పొందారు. మహిళలపై దాడులకు సంబంధించిన ప్రత్యేక కోర్టు జడ్జిగా చేశారు. మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
జస్టిస్ గీతా మిట్టల్: జమ్ముకశ్మీర్ ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1978లో ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజ్(ఢిల్లీ యూనివర్సిటీ) నుంచి ఎకనమిక్స్‌లో
డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత 1981లో ఢిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ చేశారు. 2018లో ఉపా చట్టం కింద ఏర్పాటు చేసిన
ట్రైబ్యునల్‌కు జడ్జిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఆశా మీనన్: 2019లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1979లో లేడీ శ్రీరామ్ కాలేజ్(ఢిల్లీ యూనివర్సిటీ) నుంచి ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు.