Counting : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఓట్ల లెక్కింపు (Vote Counting) మొదలైంది. ఉదయం 8 గంటలకు అన్నిచోట్ల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు. ఉదయం 7.45 గంటలకే స్ట్రాంగ్ రూమ్‌ల (Strong rooms) ను తెరిచి కౌంటింగ్ టేబుల్స్‌పైకి ఈవీఎంల (EVMs) ను చేర్చారు. మధ్యాహ్నానికి ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు అనే విషయం తేలిపోనుంది. దాంతో గత మూడునాలుగు రోజులుగా ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) రేపిన ఉత్కంఠకు తెరపడనుంది.
పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), అస్సాం (Assam) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నిచోట్ల ఇవాళే ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పశ్చిమబెంగాల్లో గతంలో మాదిరిగానే హింస చెలరేగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది.
బెంగాల్‌లోని మొత్తం 11 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్‌ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఆయా రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పలు ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. దాంతో ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఉంటుందని రాజకీయా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం అస్సాం, పుదుచ్చేరిల్లో అధికార మార్పిడి జరగబోదని, రెండు చోట్లా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమియే మళ్లీ అధికారాన్ని చేపట్టబోతోందని సర్వే సంస్థలన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. కానీ పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాల గురించే సర్వే సంస్థలు మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. అయితే బెంగాల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమిపాలు కానుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడులో డీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సంస్థలు చెప్పినా.. ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారం చేపట్టబోతోందని అంచనా వేశాయి. ఇక కేరళలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని సర్వే సంస్థలు చెప్పాయి.