పాట్నా : హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసింది. నలంద జిల్లా రాజ్‌గిర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కమల్ బిఘా గ్రామానికి చెందిన మనోరంజన్ పాశ్వాన్.. గయాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే తనకు బట్ట తల ఉండటంతో పాట్నాలోని ఓ ప్రయివేటు క్లినిక్‌లో బుధవారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్లాడు కానిస్టేబుల్.
గురువారం రోజు అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న క్లినిక్కే తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వేరే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించడం ప్రారంభించారు. కానీ గుండెపోటుతో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. కానిస్టేబుల్ చనిపోయాడని తెలుసుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ నిర్వాహకులు పరారీ అయ్యారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఇచ్చిన మందులు వాడిన తర్వాతే అతను తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికలో తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.