Congress : తమిళనాడు (Tamil Nadu) లో డీఎంకే (DMK) వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని, ఆ పార్టీ విజయ్ సారథ్యంలోని టీవీకే (TVK) తో చేతులు కలిపి తమకు వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) తిప్పికొట్టింది. డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) ఆదివారం మీడియాతో అన్నారు.
‘డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ అండగా నిలిచింది. వాళ్లు మైనారిటీలో ఉన్నప్పుడు మేం బయటే వేచిచూశాం. ఉదయనిధి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. సెక్యులర్ అలయెన్స్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రాజకీయ పొత్తు కోసం బీజేపీ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించడం కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని చెప్పారు. బీజేపీతో ఎలాంటి అవగాహనను కాంగ్రెస్ సహించే ప్రసక్తే లేదన్నారు.
బీజేపీ వరుస విజయాలకు కాంగ్రెస్సే కారణమంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత తిరునావుక్కరసు తప్పుపట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ కూటమిలో డీఎంకే కూడా ఉన్నప్పుడు బీజేపీ విజయాలకు డీఎంకే కూడా కారణమవుతుందని అన్నారు. ‘డీఎంకే మిత్రులు ఒక విషయం గ్రహించాలి. ఇప్పుడు ఎవరికి వారు తమ మార్గంలో వేర్వేరు పొత్తుల్లో కొనసాగుతున్నాం. పరుషపదజాలంతో విమర్శించుకునే బదులు మనమంతా కలిసి ప్రజల సంక్షేమం కోసం పనిచేద్దాం’ అని సూచించారు.