అరక్కపరమ్బిల్ కురియన్ ఆంటోనీ.. అలియాస్ ఏకే ఆంటోనీ.. అధిష్ఠానం తలలో నాలుక. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత… అధిష్ఠానం అత్యంత విలువనిచ్చే నాయకుడు ఏకే ఆంటోనీ. కమ్యూనిస్టుల కంచు కోటలో కాంగ్రెస్ జెండాను సాహసోపేతంగా ఎగరేసిన ధీరుడు. తన పొలిటికల్ కెరీర్‌ను కాంగ్రెస్ నుంచే ప్రారంభించారు… కాంగ్రెస్‌తో ముగించనున్నారు. 52 సంవత్సరాలు కాంగ్రెస్ మహా వృక్షం కింద.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ, కాంగ్రెస్‌ను సంక్షోభాల నుంచి గట్టెక్కించిన సిన్సియర్ నేత.
అయితే ఇంత సైలెంట్‌గా ఉన్నా… ముక్కుసూటిగానే వ్యవహరిస్తారని పేరు గడించారు. అధిష్ఠానం ముందు తన నిర్ణయం, తన మాటను నిర్మొహమాటంగా చెప్పేవారని ఆంతరంగికులు అంటుంటారు. కాంగ్రెస్ అంటేనే అనేకానేక వర్గాల సమూహం. ఎవ్వరి వర్గం వారికి ఉంటుంది. తమ మీద ఈగవాలితే.. ఆ వర్గం భగ్గుమంటుంది. అంతటి కాంగ్రెస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పర్చుకోకుండా… ఒంటరిగానే తన రాజకీయ జీవితాన్ని నడిపించుకున్నారు.
రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆంటోనీ
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఏకే ఆంటోనీ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆంటోనీ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 2 తో ముగుస్తోంది. దీని తర్వాత తాను రాజకీయాల్లో కొనసాగనని తెలిపారు. ఢిల్లీలో కూడా ఉండనని, తిరువంతనపురం వెళ్లిపోతున్నానని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీపై నిర్భీతిగానే మాట్లాడిన ఆంటోనీ
మాజీ ప్రధాని, అపర కాళిగా కీర్తింపబడ్డ ఇందిరా గాంధీకి కూడా ఏకే ఆంటోనీ నిర్మొహమాటంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ఎమర్జెన్సీని విధిస్తూ… ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకుంటే.. నిర్భీతిగా.. దాన్ని వ్యతిరేకించారు. వెంటనే ఎత్తేయాలని కూడా ఆమెతో చెప్పారు. 1976 లో గౌహతిలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఎమర్జెన్సీని ఎత్తేయాలని బహిరంగంగా ఇందిరా గాంధీని డిమాండ్ చేశారు. అయినా సరే.. అధిష్ఠానం ఆయన్ను పల్లెత్తు మాట కూడా అనలేదని సీనియర్లు అంటుంటారు.
అత్యంత నిజాయితీ పరుడిగా గుర్తింపు
కొన్ని సంవత్సరాల పాటు ఏకే ఆంటోనీ కేరళ రాజకీయాలకే పరిమితమయ్యారు.కేరళ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు ఆంటోనీ. కమ్యూనిస్టుల దుర్భేద్యమైన దుర్గాన్ని పాలించి, కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేసిన ఘటికుడు ఆంటోనీ. అత్యంత నిజాయితీపరునిగా, మిస్టర్ క్లీన్‌గా పేరు గడించారు. 1970 ల్లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 37 సంవత్సరాలకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రికార్డుల్లోకెక్కారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సొంతంగా కాంగ్రెస్ (ఏ) అన్న పార్టీనే స్థాపించారు. ఆ తర్వాత దీనిని కాంగ్రెస్‌లో కలిపేశారు. రాజీవ్, ఇందిరా, సోనియా గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా, రాహుల్‌తో కలిసి పనిచేసిన ఘనత ఆంటోనీకి దక్కింది.
1984 నుంచి ఢిల్లీకి మారిన రాజకీయం
చాలా సంవత్సరాల పాటు కేరళకే పరిమితమైన ఆంటోనీ… అధిష్ఠానం సూచనలతో ఢిల్లీకి మకాం మార్చారు. జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కాలం పాటు సభ్యునిగా కొనసాగారు. 2004 నుంచి జాతీయ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం పాటు రక్షణ మంత్రిగా కొనసాగాని క్రెడిట్ ఈయనదే. దాదాపు 5 టర్మ్‌లు రాజ్యసభ సభ్యునిగా ఆంటోనీ కొనసాగారు.
2014 తర్వాత సైలెంట్ అయిన ఆంటోనీ
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం పొందడంతో ఆంటోనీ అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. అంతర్జాతీయ అంశాలతో పాటు, పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఆయన మాట్లాడలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న విషయం తెరపైకి రావడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారందర్నీ జీ 23 అని పిలుస్తారు. అప్పుడు కూడా ఆంటోనీ అధిష్ఠానానికి వీర విధేయంగానే ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతున్నారు.