Arrest | తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని బీజేపీ మద్దతుదారురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ సంస్కర్త రామస్వామి పెరియార్, తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిధి, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారైన ఓ మహిళ ట్విట్టర్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై పోలీసులకు అధికార డీఎంకే ఐటీ వింగ్ కోఆర్డినేటర్ హరీశ్ ఫిర్యాదు చేశారు.
హరీశ్ ఫిర్యాదు మేరకు బీజేపీ మద్దతుదారుగా ఉన్న ఉమా గార్గిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ట్వీట్లు రామస్వామి పెరియార్, ఎం కరుణానిధి, ఎంకే స్టాలిన్ లను అప్రదిష్ట పాల్జేస్తున్నాయని, ప్రజల్లో అశాంతి నెలకొనే ముప్పు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హరీశ్ పేర్కొన్నారు.
ఉమా గార్గి అరెస్ట్‌ను బీజేపీ కోయంబత్తూర్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఉత్తమ రామస్వామి ఖండించారు. ఇది అధికార డీఎంకే ‘పిరికిపందల చర్య’ అని అభివర్ణించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిని అరెస్ట్ చేయడమే డీఎంకే పిరికితనానికి నిదర్శనం అని అభిప్రాయ పడ్డారు.