న్యూఢిల్లీ, ఆగస్టు 20: పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడం వివాహంతో సమానమని, వారి ఎంపికలో తల్లిదండ్రులు గానీ, స్నేహితులు గానీ జోక్యం చేసుకోలేరని, లేదా వారి ప్రాణానికి ముప్పు కలిగించలేరని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యువతి కుటుంబం నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న ఒక సహజీవన జంటకు జస్టిస్ సౌరభ్ బెనర్జీ పోలీసు రక్షణ కల్పించారు. ఎవరి జోక్యం లేకుండా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని వారితో కలిసి జీవించే పూర్తి హక్కు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.పరస్పర అంగీకారంతో వివాహం చేసుకొనే వయోజనుల కులం, వర్గం, రంగు, మతం లేదా విశ్వాసాలతో సంబంధం లేకుండా వారి వివాహాలు గుర్తింపునకు అర్హమైనవి. కేవలం సామాజిక నైతిక విలువలు,దురభిమానం కారణంగా రా జ్యాంగం కల్పించిన వారి ప్రాథమిక హక్కులను పరిమితం చేయడం అనేది వారి అస్తిత్వాన్ని హరించడమే అవుతుంది అని పేర్కొన్నారు.