లక్నో: స్కూల్కు విజయం సిద్ధించేందుకు బాలుడ్ని నరబలి ఇచ్చారు. (Boy Sacrificed For School’s Success) ఆ విద్యార్థి అనారోగ్యానికి గురైనట్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. చివరకు స్కూల్ డైరెక్టర్ కారులో బాలుడి మృతదేహం లభించింది. ఆ స్కూల్ వెనుక బావి వద్ద నరబలి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ యజమాని, స్కూల్ డైరెక్టర్ అయిన అతడి కుమారుడు, ముగ్గురు టీచర్లతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రస్గవాన్లోని డీఎస్ పబ్లిక్ స్కూల్ ఆర్థిక సమస్యల్లో ఉంది. దీంతో నరబలి ఇస్తే ఈ సమస్య తొలగడంతోపాటు స్కూల్కు విజయం లభిస్తుందని డైరెక్టర్ తండ్రి నమ్మాడు.
కాగా, సెప్టెంబర్ 22న హాస్టల్లో ఉండే రెండో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కృతార్థ్ నిద్రిస్తుండగా స్కూల్ వెనుక ఉన్న బావి వద్దకు తీసుకెళ్లి నర బలి ఇచ్చేందుకు స్కూల్ ఓనర్, డైరెక్టర్, టీచర్లు ప్రయత్నించారు. హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా నిద్ర నుంచి లేచిన ఆ బాలుడు భయంతో ఏడ్వడంతో అతడి గొంతు నొక్కి చంపారు. ఆ తర్వాత విద్యార్థి తండ్రికి స్కూల్ సిబ్బంది ఫోన్ చేశారు. అతడి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు.
మరోవైపు బాలుడి తండ్రి ఆ స్కూల్కు చేరుకోగా అతడి కుమారుడ్ని స్కూల్ డైరెక్టర్ కారులో హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో బాలుడి తండ్రి, మరి కొందరు కలిసి ఆ కారును అనుసరించి దానిని ఆపేందుకు ప్రయత్నించారు. చివరకు సదాబాద్ వద్ద ఆ కారును అడ్డుకున్నారు. కారులో బాలుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, స్కూల్ వెనుక ఉన్న బావి వద్ద నర బలికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 6న కూడా 9 ఏళ్ల విద్యార్థిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ యజమాని జశోధన్ సింగ్, అతడి కుమారుడు, స్కూల్ డైరెక్టర్ దినేష్ బాఘేల్, ముగ్గురు ఉపాధ్యాయులతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.