Civils Aspirant | న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల తాకిడికి మరో విద్యార్థిని బలైంది. ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో అంజలి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను నిజంగా విసిగిపోయాను. సమస్యలు, బాధలు..తప్ప మనసుకు శాంతి లేదిక్కడ. బయటపడేందకు అనేక విధాలుగా ప్రయత్నించా. కానీ నా వల్ల కాలేదు’ అంటూ తన మరణానికి కారణాల్ని సూసైడ్ నోట్లో ఆమె పేర్కొన్నారు. సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించాలని కలలు కనే విద్యార్థులు ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో పడుతున్న అవస్థల్ని ఈ ఘటన మరోసారి బయటపెట్టింది. ఈ ఆత్మహత్య ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాత రాజేందర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు. దీనికంటే కొద్ది రోజుల ముందు ఆత్మహత్య ఘటన చోటుచేసుకుందని సమాచారం. విద్యార్థులను ఇక్కడి ప్రైవేట్ హాస్టల్స్, వసతి గృహాలు దోపిడి చేస్తున్నాయంటూ అంజలీ ఆవేదన చెందేదని తోటి స్నేహితురాలు శ్వేత చెప్పారు. ‘అంజలి మూడుమార్లు సివిల్స్ రాసింది. ఫలితం అనుకున్న విధంగా రాలేదు. మరోవైపు ప్రతినెలా పెరుగుతున్న ఖర్చులు, హాస్టల్ అద్దె భరించలేని విధంగా మారాయి. ఇదంతా ఆమెను తీవ్రంగా కుంగదీశాయి’ అని శ్వేత వెల్లడించారు.