భోపాల్ : మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్న 29 ఏళ్ల అర్చనా తివారి(Archana Tiwari) అదృశ్యం కేసు ఆ రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే 13 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ చిక్కింది. ఇండోర్ నుంచి కట్నీకి వెళ్లేందుకు రైలు ఎక్కిన ఆమె మరోనాడు అదృశ్యమైంది. ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఓ పోలీసుతో ఆమె టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. ఆమె బ్రతికే ఉన్నట్లు సోదరుడు దివ్యాంశు మిశ్రా కన్ఫర్మ్ చేశాడు. ఈ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని భోపాల్ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ కుమార్ లోదా తెలిపారు. కానీ ఆయన పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
లాయర్ అర్చన సివిల్ జడ్జి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. రాఖీ పండుగ ముందు రోజు ఆమె రైలు ఎక్కింది. రాఖీలు, గిఫ్ట్‌లతో ఉన్న బ్యాగును అధికారులు రైలులోనే గుర్తించారు. దీంతో ఆమె అదృశ్యమైన వార్త సంచలన రేపింది. ఇండోర్ నుంచి బిలాస్పూర్ వెళ్లే నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో ఆగస్టు 7వ తేదీన ఆమె ట్రావెల్ చేసింది. రైలు భోపాల్ వద్దకు వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకు తల్లితో ఫోన్లో మాట్లాడింది. కానీ ఆ తర్వాత ఆమె ఆచూకీ లేకుండాపోయింది.
పోలీసుల ప్రకారం అర్చన చివరి ఫోన్ కాల్ సిగ్నల్ నర్మదా నది సమీపం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఆ నది పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. ఇక కట్నీ యూత్ కాంగ్రెస్ నేత ఒకరు ఏకంగా ఆమె సమాచారం చెబితే 51 వేలు ఇస్తానని ప్రకటించారు. అయితే కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త ట్విస్ట్ దొరికింది. ఈ కేసులో రామ్ తోమర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే ఆమెకు టికెట్ బుక్ చేశాడు. గ్వాలియర్లోనే అర్చన ఉన్నట్లు అనుమానించారు. రామ్ తోమర్ మొబైల్‌ను సీజ్ చేసి దాన్ని ఫోరెన్సిక్‌కు పంపారు. అర్చన అదృశ్యం వెనుక ఇతని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.