లక్నో: జమాలుద్దిన్ అలియాస్ చంగూర్ బాబా(Chhangur Baba)పై .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమంగా మత మార్పిడులకు పాల్పడినట్లు చంగూర్ బాబాపై ఆరోపణలు ఉన్నాయి. విదేశీ నిధులను కూడా భారీగా సేకరించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ 2024లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంగూర్ బాబాను కరీముల్లా షా అని కూడా పిలుస్తున్నారు. బలరాంపూర్‌లో ఉన్న చాంద్ ఔలియా దర్గాలో అధిక సంఖ్యలో మతమార్పిడులకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
సైకాలజికల్ వ్యూహాలు, మతపరమైన చర్చలు, విదేశీ నిధులతో .. ఆర్థికంగా వెనుకబడిన వారిని మార్చే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా ఎస్సీలను ఇస్లాంలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. చంగూర్ బాబాతో పాటు అతని అనుచరులకు చెందిన 40 బ్యాంకు అకౌంట్లలో 106 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ శాతం డబ్బు పశ్చిమాసియా నుంచి అందినట్లు తెలుస్తోంది.
చంగూర్ బాబా, నీతూ అలియాస్ నస్రీన్‌ను.. జూలై 5వ తేదీన లక్నోలో ఏటీఎస్ అదికారులు అరెస్టు చేశారు. అతనికి చెందిన అనేక ప్రాపర్టీలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. బ్యాంకులు, స్థానిక అధికారుల నుంచి ఈడీ అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నది.