దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు- భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర పోరులో 31మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంపై పోలీసులు దాడి చేయడం కాల్పులకు దారితీసింది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 40 రోజుల్లో 81 మంది నక్సల్స్ భదత్రాబలగాల కాల్పుల్లో మృతిచెందారు.
Maoists | ముంబై/ కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. ఈ ఆపరేషన్‌లో వెయ్యి మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్కు చెందిన ఇద్దరు జవాన్లు నక్సల్స్ కాల్పుల్లో మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్ ప్రాంతంలో నక్సలైట్ల కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నది.
బీజాపూర్ జిల్లా ఫర్సేఘఢ్ ఇలాకాలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం నేషనల్ పార్క్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే మావోయిస్టులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు మూడు-నాలుగు సార్లు విడతల వారీగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల ధాటికి తాళలేక కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 31మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఏకే-47, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్లతోపాటు భారీఎత్తున ఇతర ఆయుధ వస్తు, సామాగ్రిని స్వాధీనపరుచుకున్నాయి.
మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణ క్యాడర్‌కి చెందినవారు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ మీడియాతో మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 81 మంది మావోయిసులు మృతి చెందారు. సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మందమర్రి ప్రాంతానికి చెందిన బండి ప్రకాశ్(65) అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ ఈ ఎదురు కాల్పుల్లో మృతిచెందినట్లు సమాచారం. ఆదిలాబాద్ ఏరియా కార్యదర్శి ఆదేలు భాస్కర్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ కల్లా దేశంలో నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తామని, నక్సలిజం కారణంగా దేశానికి చెందిన ఏ ఒక్క పౌరుడూ మరణించడానికి వీల్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.