న్యూఢిల్లీ: ఏటీఎంలో నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్ లావాదేవీలపై చార్జీలు మే 1 నుంచి పెరుగుతాయి. ఖాతా ఉన్న హోం బ్యాంక్ నెట్వర్క్ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్ నెట్‌వర్క్‌లోని ఏటీఎం నుంచి లావాదేవీలను జరిపే వారిపై ఈ భారం పడుతుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా మెట్రో నగరాల్లో నెలకు 5 లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు లావాదేవీలు ఉచితంగా జరుపుకోవచ్చు.
ఈ పరిమితి దాటిన తర్వాత జరిపే ప్రతి లావాదేవీపైనా అదనపు భారం పడుతుంది. నగదు ఉపసంహరణ రుసుము ప్రతి లావాదేవీకి రూ.17 నుంచి రూ.19కి పెరుగుతుంది. బ్యాలన్స్ ఎంక్వైరీ ఫీజు ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7కు పెరుగుతుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నందు వల్ల ఈ రుసుములను పెంచాలని వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చాలా కాలం నుంచి కోరుతున్నారు.