న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. ఈ మేరకు నిబంధనలను బుధవారం ఉపసంహరించుకున్నది. 25 ఫిబ్రవరి, 2022 నాటి హోంశాఖ ఆదేశాలు గడువు ముగిసిన తర్వాత, తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడని స్పష్టం చేసింది.
అయినప్పటికీ ఫేస్మాస్క్ల వాడకం, చేతుల పరిశుభ్రత సహా కొవిడ్ నియంత్రణ చర్యలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొవిడ్ నియంత్రణ చర్యలపై సలహాలు జారీ చేయడంతో పాటు మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు హోం సెక్రెటరీ అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. వైరస్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని.. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన ఉందన్నారు.
కేసుల సంఖ్యలో ఏదైనా పెరుగుదల కనిపించిన చోట.. రాష్ట్రాలు, యూటీలు సత్వరం క్రియాశీల చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుందన్న ఆయన.. జాతీయ విపత్తు చట్టంలోని మార్గదర్శకాల అమలును నిలిపివేయాలన్నారు. రాష్ట్రాలు, యూటీలు అమలు చేస్తున్న ఎస్ఓపీల అమలును కొనసాగించవచ్చని పేర్కొన్నారు.
కొవిడ్ నియంత్రణ చర్యలు, టీకాలు తదితర అంశాలపై ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుందన్నారు. దేశంలో కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడు వారాల్లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 23,913 ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.