న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 2,873 మంది వ్యక్తులు మినహా మిగిలిన విద్యార్థులపై ఉన్న అన్ని కేసులను కొట్టివేయవచ్చని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇంతకుముందే విన్నవించారు. పరీక్షల్లో అవకతవకలపై 36 రోజుల పాటు చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు జూలై 25న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టనున్న నిరసనకు ముందుగా ఈ పరిణామం చోటుచేసుకుంది.