Agniveers : అగ్నివీరులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సరిహద్దు భద్రతా దళం (BSF) నియామకాల్లో అగ్నివీరుల (Agniveer) కు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో ఇప్పటివరకు 10 శాతంగా అగ్నివీరుల రిజర్వేషన్ కోటాను 50 శాతానికి పెంచినట్లు పేర్కొంది.
మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50 శాతం ఖాళీలకు, రెండో దశలో మాజీ అగ్నివీరులు కాకుండా మిగిలిన (పది శాతం మాజీ సైనికులతో సహా) ఖాళీలకు నియామకాలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మొదటి దశలోని ఒక నిర్దిష్ట విభాగంలో మాజీ అగ్నివీరులతో కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి 2022 జూన్లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అగ్నివీరులుగా వారి నాలుగేళ్ల సర్వీస్ ముగిసిన అనంతరం రిజర్వేషన్ ద్వారా కేంద్ర పారామిలిటరీ బలగాల్లో వారిని నియమించుకుంటున్నారు. ఇందులో భాగంగానే గతంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాలలోని కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీలలో 10 శాతం కోటా మాజీ అగ్నివీరులకు కేటాయించారు.
అయితే తాజా నోటిఫికేషన్లో.. అగ్నివీరులకు 50 శాతం రిజర్వేషన్ కోటాను ఇతర కేంద్ర పారామిలిటరీ దళాల్లో కాకుండా కేవలం బీఎస్ఎఫ్ నియామకాల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మాజీ అగ్నివీరులకు శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వగా.. రాత పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.