న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆరేండ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం 3-8 ఏండ్లలోపు పిల్లలందరికీ పునాది(ప్రాథమిక) స్థాయిలో అయిదేండ్ల పాటు నేర్చుకొనే అవకాశం ఉండాలి.
మూడేం డ్ల పాఠశాల పూర్వ విద్యతోపాటు 1, 2 తరగతుల కాలం ఈ అయిదేండ్ల పరిధిలోకి వస్తుంది. పునాది స్థాయిలో అర్హులైన ఉపాధ్యాయుల అవసరం చాలా ముఖ్యమని, వారు పిల్లల అభివృద్ధికి సంబంధించిన పాఠ్యాంశాలు, బోధనా శాస్త్రంలో శిక్షణ పొందినవారై ఉండాలని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. ఇందుకోసం పూర్వ పాఠశాల విద్యలో రెండేండ్ల డిప్లొమా కోర్సును రూపొందించాలని రాష్ర్టాలకు సూచించింది.