లక్నో: పిల్లి ఎదురురావడంతో అపశకునంగా భావించిన దొంగలు పారిపోకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి చిక్కడంతో వారు అరెస్ట్ అయ్యారు (Cat crossing path superstition). ఆ దొంగల వద్ద భారీగా ఉన్న డబ్బు, నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. ఒక దొంగల ముఠా ఝాన్సీలో చెలరేగిపోయింది. పలు దొంగతనాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
కాగా, ఒక చోట దొంగతానికి పాల్పడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఒక పిల్లి వారికి ఎదురైంది. దీంతో అపశకునంగా భావించారు. ఈ మూఢనమ్మకం కారణంగా పారిపోకుండా కొంతసేపు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందిన అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌గా వారిని గుర్తించారు. ఆ దొంగల నుంచి భారీగా డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ దొంగలను పోలీసులు ప్రశ్నించారు. చోరీ తర్వాత పిల్లి అటుగా వెళ్లడంతో చెడు జరుగుతుందని భావించి పారిపోకుండా అక్కడ ఉన్నట్లు ఒక దొంగ చెప్పాడు. అయితే ఝాన్సీలో జరిగిన పలు చోరీలతో వీరికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠాను పట్టుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అరెస్ట్ అయ్యారని పోలీస్ అధికారి వెల్లడించారు.