Cosmetics | కాస్మెటిక్స్ (సౌందర్య సాధనాలు), వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు ఉన్నట్టు కెనడా పరిశోధకులు గుర్తించారు. వాటి వాడకం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణానికి హాని జరుగుతుందని హెచ్చరించారు. కాస్మెటిక్స్ వినియోగిస్తున్న తల్లుల పాలల్లోనూ ఈ రసాయనాల అవశేషాలు కనిపించాయని వారు తెలిపారు. కెనడాలోని కార్లెటన్ యూనివర్సిటీకి చెందిన ఎన్విరాన్మెంటల్, టాక్సికాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమీ ర్యాండ్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు. కాస్మెటిక్స్ శాంపిళ్లలో హానికర ప్రి- అండ్ పాలిఫ్లోరోల్కిల్ (పీఏఎఫ్ఎస్) అనే హానికర పదార్థం ఉన్నట్టు వారు తేల్చారు. ది కన్జర్వేషన్ జర్నల్‌లో అధ్యయన ఫలితాన్ని ప్రచురించారు.
యూరోపియన్ యూనియన్, కాలిఫోర్నియాలో వీటిపై నిషేధం విధించే దిశగా కార్యాచరణ మొదలైందని, కెనడాలోనూ నిషేధం విధించాలని పరిశోధకులు సూచించారు. సన్‌స్క్రీన్స్, మాయిశ్చరైజర్, షేవింగ్ క్రీమ్, ఫౌండేషన్లలో ఈ రసాయనాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సీ6-16 పర్ఫ్లోరోల్కిల్ ఈథైల్ పాస్ఫేట్, పర్ఫ్లోరోక్టిల్ ట్రైథాక్సీసిలెన్, పర్ఫ్లోరోబుటిన్స్ తదితర రసాయనాలను ఎక్కువగా కాస్మెటిక్స్‌లో వినియోగిస్తున్నట్టు వారు గుర్తించారు.
కాస్మెటిక్స్‌లో పీఏఎఫ్ఎస్ రసాయనాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు కెనడా పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. వెయ్యి రెట్లకు పైగా రసాయన అవశేషాలు కాస్మెటిక్స్‌లో వినియోగిస్తున్నట్టు పరీక్షల్లో తేలింది.
రసాయనాల ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఓ వ్యక్తిపై దీన్ని ప్రయోగించారు. సన్‌స్క్రీన్‌కు ఈ రసాయనాన్ని కలిపి ఓ వ్యక్తికి అందించారు. మూడు వారాల తర్వాత పరిశీలించగా అతని శరీరంలో సన్‌స్క్రీన్ నుంచి విడుదలైన పీఎఫ్‌వోఏ రసాయనం అంతకుముందే అతడి శరీరంలోని రసాయనంలో పది శాతానికి సమానమని తేలింది. ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడకం వల్ల రక్త స్థాయులు పెరుగుతాయని హెచ్చరించారు. శరీరంలోని పీఎఫ్‌వోఏ రసాయనంలో సగభాగం తొలగాలంటే సుమారు రెండేండ్లు పడుతుంది. పూర్తి స్థాయిలో తొలిగిపోవాలంటే మరో ఏడాదికిపైగా పడుతుంది. కాస్మెటిక్స్ వాడేవారిలో రసాయనాలు జీవితాంతం శరీరంలోనే పేరుకుపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మురుగు, ఘన వ్యర్థాల రూపంలో ఏటా సుమారు 80 వేల కిలోల రసాయనాలు విడుదలవుతున్నాయని, ఇవి జలాశయాల్లో కలుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చేపలు, మాంసం, ఆ నీటితో పండే పంటలు తినడం వల్ల మానవ శరీరంలోకి హానికర రసాయనాలు చేరుతున్నట్టు తెలిపారు. వీటిని భూమిలో నిర్వీర్యం చేసే సాధనం లేకపోవడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతున్నదని విచారం వ్యక్తం చేశారు.
– నేషనల్ డెస్క్