న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వ్యాసకర్త అన్నే కార్సన్ ప్రతిష్టాత్మక సాహిత్య నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆమె సాగించిన సృజనాత్మక రచనలకు గుర్తింపుగా స్వీడిష్ అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అకాడమీ శాశ్వత కార్యదర్శి ఇంగ్రిడ్ కార్ల్బర్డ్ ఈ సమాచారం అందించే సమయానికి ఆమె ఐస్ల్యాండ్లో ఉన్నారు.
ఈ పురస్కార ప్రకటన తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని 76 ఏండ్ల కార్సన్ పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ పురస్కార గ్రహీతలకు 12 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు(సుమారు 1.2 మిలియన్ డాలర్లు) అందుతాయి. టొరంటోలో జన్మించిన అన్నే కార్సన్ ప్రాచీన గ్రీక్, రోమన్ సాహిత్య నేపథ్యాలను కవిత్వం, వ్యాసాలు, కల్పనా రూపాలలో మేళవించి రచనలు చేయడంలో గుర్తింపు పొందారు.